విద్యార్థులు మీరే..

విద్యార్థుల రక్తము చిందని పోరే లేదు

విద్యార్థుల త్యాగము రాయని చరితే లేదు

పోటెత్తిన నెత్తుటేరు కెరటాలై ఎగిసే

మన విద్యార్థుల సాహసము చవి చూడని నేల లేదు

విద్యార్థులు మీరే.. నవసమాజ స్థాపనకై నడిచే యోధులు మీరే..

విద్యార్థులు మీరే..                                            “విద్యార్థులు మీరే..”

 

బెంగాలు ఐక్యతకై పొంగిన ఆ వెల్లువలో

అనుశీలన సమితి పెట్టి ఆలోచన రేపి

బ్రిటిషోడి బిస్తరును హస్తినకు మార్పించ

నడిబజారులలో కాల్చి బేజారెత్తించిన

ఎక్కుపెట్టినా తుపాకీ మన ప్రపుల్లచాకి

మదన్ లాల్ ఖుదీరాము జతిన్ ముఖర్జీ మీరే..           “విద్యార్థులు మీరే..”

 

శత్రువు బలహీనతపై చావు దెబ్బ తియ్యాలని

ప్రపంచయుద్ధంలోనే ప్రభుత్వాన్ని కూల్చాలని

పుస్తకాలు వదిలిపెట్టి పిస్తోళ్లు చేతబట్టి

సముద్రాల సరిహద్దులు నావలలో అధిగమించి

శరభ శరభని దూకిన కర్తార్ సింగ్ శరభలు

గడగడలాడించిన గదర్ వీరులు మీరే                      “విద్యార్థులు మీరే..”

 

జలియన్ వాలా బాగు గుండెను తొలిచేయగా

చిందిన నెత్తుటి జడలో శపథం చేపూనగా

హిందూస్తాన్ సోషలిస్ట్ ఆర్మీ సైనికులై

భరతమాత నడిబొడ్డున లేచిన బొబ్బులులై

పంజాలెత్తినా ఆజాద్ రాజగురు సుఖదేవు

భగత్ సింగ్ రసబిహరి వారసులు మీరే                    “విద్యార్థులు మీరే..”

 

మన్నెంలో పోరాటపు వెన్నెల కురిపించి

ఆదివాసి గూడాలను ముందుకు నడిపించి

ఆయుధాలు గుంచుకుని ఆంగ్లేయుల తరమాలని

చింతపల్లి చిట్ గాంగు దాడి చేసి దోచుకున్న

తుఫానులై చెలరేగిన అల్లూరి సూర్యసేను

ఆదర్శపు బాటలోన అడుగులు వేయాలి మీరే             “విద్యార్థులు మీరే..”

 

నైజాము రజాకర్ల గంగవెర్రులెత్తించిన

తెలంగాణా తొలిచూలు గంగవరపు శ్రీనివాసు

మిలట్రీ మూకల గెదిమిన ధీరుడు మాధవరెడ్డి

తిరుగుబాటు జండెత్తిన శూరుడు తిరుమలరెడ్డి

భూమి భుక్తి ముక్తి కొరకు సాగిన ఆ తెలంగాణా

సాయుధపోరాటంలో చేతులు కలిపింది మీరే..             “విద్యార్థులు మీరే..”

 

నక్సల్బరి పిలుపు విని నిలువెల్లా ఉడికిపోతూ

శ్రీకాకుళం చేరుకున్న చాగంటి మల్లి బాల

పడావైన బంజరులో కురిసిన ఆ తొలకరికి

తెలంగాణా చాళ్ళల్లో తిరిగి మొలిచిన బత్తుల

జార్జిరెడ్డి జంపాల అమరులైన బాట నడిచి

గోదావరిలోయ పోరు ముందున నిలిచింది మీరే..         “విద్యార్థులు మీరే..”

 

ఉద్యమాల ఉప్పెనైన ఉస్మానియా యూనివర్సిటీ

కదం తొక్కి భుజం కలిపె కాకతీయ ముంగిలి

సకలజనుల సమ్మెలయ్యి మానవ హారాలయ్యి

దారితప్పిన నాయకుల దారిలోకి తీసుకొచ్చి

మిలియన్ మార్చ్ అయి సాగి మెడలు వంచి కేంద్రాన్ని

తెలంగాణా సాధించిన తొలివేకువలు మీరే                          “విద్యార్థులు మీరే..”

 

హెచ్ సి యు, జే ఎన్ యు ప్రతి కాంపస్ ప్రతినబూని

రోహిత్ ని తలుచుకుంటూ కన్నయ్యల మలుచుకుంటూ

ఆత్మగౌరవం కోసం ఆజాది పిలుపునిచ్చి

మనువాదం కులవాదం పాడికట్టి పాతిపెట్టె

బుద్ధుడు కారల్ మార్క్సు అంబేద్కర్ ఆలోచన

సారాన్ని అందించిన సాహసతాత్వికులు మీరే             “విద్యార్థులు మీరే..”

 

ప్రజాపోరు సముద్రాన పెల్లుబికే పొంగుమీరే

పోరాటపు మరఫిరంగి నంటించే మందు మీరే

తరతరాల అన్యాయపు దోపిడిని ఎదిరించ

నరనరాన్న ఉత్తేజం నింపుకున్నది మీరే

సాంస్కృతిక విప్లవాన సారధులవ్వాలి మీరే

సమాజంలో ఈ పీడన సమాధి కట్టాలి మీరే..              “విద్యార్థులు మీరే..”

 

 

 

 

 

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s