MY SONGS

అమ్మబాబో మన హాస్టలన్నా

16/5/1983

అమ్మబాబో మన హాస్టలన్నా

దీని కన్నా బందెలదొడ్డి మిన్నా..            “అమ్మబాబో”

ఓ.. కంపుగొట్టే దొడ్లురన్న కూలుతున్న షెడ్లురన్న

పై కప్పు చిల్లులన్న నేలంతా గుంటలన్న

సొట్టబడ్డ పెట్టెలన్న సినిగిన దుప్పట్లురన్న

దుప్పట్లో నల్లులన్న గుమ్మంలో పందులన్న      “అమ్మబాబో”

ఓ.. వర్షకాలమొస్తెరన్న హాస్టలొక చెరువురన్న

గుయ్యిగుయ్యి దోమలన్న బుయ్యిబుయ్యి ఈగలన్న

కుక్కల చెలగాటమన్న పిల్లల కిరకాటమన్న

కప్పల బెకబెకలురన్న పాముల బుసబుసలురన్న “అమ్మబాబో”

ముక్కీన అన్నమన్న రాల్లున్న పప్పురన్న

పుచ్చీన కూరలన్న పులుపు లేని చారురన్న

మంచినూనె సున్నరన్న మంచినీల్లు కరువురన్న

నీసుకూర లేనెలేదు రోస్టు అంటె ఎరికె లేదు       “అమ్మబాబో”

ఇది ఏమి తిండాని ఎదురుతిరిగి మేమంతా

వంటవాడి నడగబోతె వార్డెన్ను అడగమానె

వార్డెన్ను అడగబోతె గవర్నమెంటు గట్లనండు

గవర్నమెంటు నడగబోతె గన్నులెక్కు పెడుతుండ్రు.. “అమ్మబాబో”

ఎన్నాల్లు గడ్చినాను సబ్బులేమె రాకపోయె

వంటిపైన మురికి పోక వల్లంతా దురదబుట్టె

గోకిగోకి అందరికి గజ్జేమొ పుట్టబట్టె

గజ్జి తగ్గనీకి మేము ఆసుపత్రి కెల్లితేను

గజ్జి తగ్గుడేమొ కాని తామర కూడ అంటబట్టె “అమ్మబాబో”

వచ్చె ఇంత సొమ్ములోనె వార్డెను వాటా కొంత

సబ్బూల డబ్బులన్ని సుబ్బరంగ మెక్కినాడు

నూనె డబ్బలమ్ముకుని నిగనిగ లాడుతుండు

నోటు బుక్సునమ్ముకుని సూటును గుట్టించుకుండు

బియ్యం బస్తలమ్ముకొని బంగ్ల గట్టించుకుండు

గవర్నమెంటు గ్రాంట్లు మెక్కి గొడ్డులాగ బలిసినాడు “అమ్మబాబో”

బి.సి ఎస్.సి ఎస్.టి వోల్లు గవర్నమెంటు కిష్టమాని

రుజువు చేసెటందుకె రిజర్వేషను పెట్టామని

ఎంగిలి మెతుకులాను ఇసురుతుంది గవర్నమెంటు

పేదప్రజల బాగు అంటు ఫోజులెన్నొ కొడుతుంది

వెల్ ఫేర్ హాస్టలెట్టి కిల్ ఫేర్ చేస్తుంది..           “అమ్మబాబో”

Advertisements